ఉవ్వెత్తున ఎగిసిపడిన తెలంగాణ ఉద్యమంలో తన కలంతో… గళంతో ప్రజలను చైతన్యం చేస్తూ, ప్రత్యక్ష పోరాటంలోనూ ప్రముఖ పాత్ర పోషించిన తెలంగాణ పోరుబిడ్డ, నల్లగొండ పులిబిడ్డ, మునుగోడు మద్దుబిడ్డ, ప్రజా పక్షపాతి, పాత్రికేయ యోధుడు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (TUWJ) ఉపాధ్యక్షులు పల్లె రవి కుమార్‌.
 జర్నలిస్టుగా జనం గోడును, అన్నదాతల ఆక్రందనల్ని మీడియా ద్వారా ప్రపంచానికి చాటారు. 2001 మే 31న రూపుదిద్దుకున్న తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఏర్పాటులో కీలక భూమిక పోషించి.. తెలంగాణ కోసం అలుపెరుగని పోరాటం చేశారు. తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యే వరకు మడమ తిప్పని యోధుని వలె కదంతొక్కారు.
 “ తెలంగాణ కోసమే..
   తెలంగాణ జర్నలిస్టులు”  అనే నినాదంతో  మలిదశ తెలంగాణ ఉద్యమంలోని ప్రతీ కదలికలో రవన్న కదం కదిపారు. జర్నలిస్టుగా తమ రాతల ద్వారా , తన ప్రసంగాల ద్వారా ప్రజలను ఉద్యమోన్ముఖుల్ని చేశారు..  అప్పటి నుంచి ఆయన ఆలోచన విధానమంతా తెలంగాణ కోసమే సాగింది. అందరూ సుఖశాంతులతో జీవించాలని కలలుగన్నారు పల్లె రవి.
కుటుంబ నేపథ్యం ..
  పల్లె రవి కుటుంబ నేపథ్యం కూడా ప్రజా జీవితంలో ముడిపడిందే.  తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో రవి నాన్నమ్మ రాములమ్మ ప్రత్యక్షంగా ..వీరోచితంగా పోరాడిన ధీర వనిత. అదే పోరాటపటిమ, కార్యదక్షత రవన్న రక్తంలోనే ఉంది. పల్లె రవి తండ్రి లింగయ్య కూడా బొడాంగ్ పర్తి గ్రామానికి 1986 నుంచి 1995 వరకు సర్పంచ్ గా ప్రజాసేవకే అంకితమయ్యారు. గ్రామస్తుల నుంచి మంచి పేరు సంపాదించుకున్నారు. లింగయ్య అంటే ఆనాడు అందరికీ తలలో నాలుకలాంటివారు. రవన్న కూడా అదే వారసత్వ లక్షణాలను పునికిపుచ్చుకున్నారు. నాన్నమ్మ నుంచి పోరాటపటిమ, నాన్న లింగయ్య నుంచి పరిపాలనా దక్షత, ప్రజలపక్షాన నిలవడం ఆయనకు సహజంగానే అలవడ్డాయి. అదే లక్షణాల కారణంగా తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల ఫోరం స్థాపనతో ముందుకుసాగడం కనిపిస్తుంది.
      రవన్న ఉన్నచోట ప్రజా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. రైతులకు భరోసా లభిస్తుంది. తాను పుట్టిన గౌడ సామాజికవర్గంలో గీత కార్మికుల కష్టాలు పడుతుంటే చూస్తూ ఊరుకోలేక వారి కోసం, వారి హక్కుల కోసం పోరాడారు. రవన్న ఎక్కడున్నా ప్రజా సమస్యలపై సమరశంఖం పూరిస్తూనే ఉన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో.. పలు జేఏసీల ఏర్పాటులో పల్లె రవిది కీలక భూమిక. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (TUWJ) స్థాపనలో ఆయన కార్యదక్షత ఎనలేనిది. ప్రత్యేక తెలంగాణ కోసం అలుపెరుగని పోరాటం చేశారు. పీపుల్స్ ఫౌండేషన్ ఛైర్మన్ గా, తెలంగాణ కుకింగ్ గ్యాస్ డెలివరీ వర్కర్స్ యూనియన్ కు గౌరవాధ్యక్షుడిగా కొనసాగారు. 2011, 2013 లలో  రెండు పర్యాయాలు అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవ నిర్వాహక కమిటీ సభ్యులుగా పల్లె రవి సేవలందించారు. 2014 నుంచి తెలంగాణ స్టేట్ మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యులుగా అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ అందేలా కృషి చేస్తున్నారు. అటు డెస్క్ జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వంతో మాట్లాడి యూనియన్ పెద్దలతో కలిసి హెల్త్ కార్డులు, అక్రిడేషన్లు, పలు సంక్షేమ పథకాలు జర్నలిస్టులకు అందేలా కృషి చేస్తున్నారు. వెల్ నెస్ సెంటర్లలో మెరుగైన వైద్య సదుపాయాల కోసం శ్రమిస్తూనే… పాత్రికేయులకు అందుతున్న వైద్య సేవలను ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు. అనారోగ్యం బారిన పడిన.. ప్రమాదాలకు గురైన జర్నలిస్టుల, బడుగు, బలహీన వర్గాలకు అవసరమైనప్పుడల్లా ఆపన్న హస్తం అందిస్తూనే ఉన్నారు.  రవి ఏ రంగంలో ఉన్నా… నూటికి నూరు శాతం ఆ రంగంలోని వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తారు. రవన్న అని పిలిస్తే చాలు వారి కష్టాల్లో భాగస్వామి అవుతారు.  పల్లె రవికి ప్రజాజీవితమంటేనే ఇష్టం. ప్రజలతో మమేకమవడం, వారి కష్టాల్లో పాలుపంచుకోవడం, జనం బాధలను తన బాధలుగా భావించి వారికి భరోసా ఇవ్వడం, వారి బాగోగుల కోసం పరితపించడం ఆయనకు సహజంగానే అలవడ్డాయి. అది ఆయన నైజం అని చెప్పవచ్చు.
* బాల్యం – విద్యాభ్యాసం
పల్లె వజ్రమ్మ, లింగయ్య దంపతులకు  ఏప్రిల్ 2, 1972న నల్లగొండ జిల్లా చండూరు మండలం బోడంగపర్తి గ్రామంలో పల్లె రవి కుమార్ జన్మించారు.  చిన్నప్పటి నుంచే చదువుల్లోనూ ముందున్న రవికుమార్.. ఒకటి నుంచి 5వ తరగతి వరకు స్వగ్రామంలో విద్యాభ్యాసం కొనసాగించారు. 6-7 తరగతులు పుల్లెంలలో, 8 నుంచి 10 వ తరగతి వరకు ZPPHS మునుగోడులో చదువుకున్నారు. మొదటి నుంచీ చదువుల్లో టాపర్ గా  నిలిచిన పల్లె రవి ఇంటర్, డిగ్రీల్లోనూ అదే పంథాను కొనసాగించారు. హైదరాబాద్ లోని BJR ప్రభుత్వ కళాశాలలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. బీఎస్సీలోనూ రవే ఫస్ట్. డిగ్రీ చదువుతున్న సమయంలోనే సివిల్స్ లో రాణించాలని ప్రతీక్షణం పరితపించిన రవికి ఆర్థికఇబ్బందులతో ప్రజాసేవకు రెండో ఆప్షన్ గా జర్నలిజాన్ని ఎంచుకున్నారు.  శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం (MCJ) పూర్తి చేసిన తర్వాత పాత్రికేయ వృత్తిలో కొనసాగుతూ ప్రజాసేవలో నిమగ్నమయ్యారు.
* పాత్రికేయ రంగంలో..
పల్లె రవి 1996 లో ఆంధ్రజ్యోతి దినపత్రికలో తన పాత్రికేయ ప్రస్థానం ప్రారంభించారు. నాలుగేళ్లు అదే సంస్థలో కొనసాగి పాత్రికేయ రంగంపై పట్టుసాధించారు. తన కలానికి మరింత పదునుపెట్టి ప్రజల పక్షాన గళామెత్తారు. 2000 సంవత్సరంలో వార్తా దినపత్రికలో స్టేట్ బ్యూరో రిపోర్టర్, సీనియర్ పొలిటికల్ కరస్పాండెంట్ గా అనేక రాజకీయ విశ్లేషణలు అందించారు. జనం కోసం,  బాధితుల పక్షాన అక్షర సమరం కొనసాగిస్తూ వచ్చారు.
2012 నుంచి తెలంగాణ 24*7 మాసపత్రిక ,వెబ్ పోర్టల్ కు సీఈవో కమ్ చీఫ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.  అనేక ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలపై పట్టు, విశ్లేషణా పటిమతో అందరి మన్ననలు అందుకున్నారు.. నేటికీ అందుకుంటూనే ఉన్నారు.
      ప్రభుత్వ సర్వీస్ మ్యాటర్స్ పై మంచిపట్టున్న పల్లె రవి.. 1975 ప్రెసిడెన్షియల్ ఆర్డర్.. సంబంధిత అంశాలపై విస్తృతమైన అధ్యయనం చేశారు. తెలంగాణ స్థానికతకు కీలకమైన 610 జీవో .. సంబంధిత జీవోలపైనా పట్టు సాధించారు. గిర్ గ్లానీ కమిషన్ రిపోర్ట్, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉల్లంఘనలపై పూర్తి అధ్యయనం చేశారు. ఈ విషయాలపై ఉన్న సాధికారతతో తెలంగాణ ఉద్యమంలో పల్లె రవి ప్రజాకాంక్ష గొంతుకయ్యారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలపై పట్టున్న రవి తన రాతల ద్వారా.. తన మాటల ద్వారా అందర్నీ ఒప్పించారు. ప్రియతమ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారితో సన్నిహితంగా ఉంటూ.. జర్నలిస్టుల, ప్రజల బాధల్ని వివరిస్తూ అభివృద్ధికి దోహదకారిగా ముందుకు సాగుతున్నారు.
* తెలంగాణ ఉద్యమంలో..
తెలంగాణ కోసమే..తెలంగాణ జర్నలిస్టులు.. అనే నినాదంతో 2001 మే 31న తెలంగాణ జర్నలిస్టుల ఫోరం(TJF) ఆవిర్భవించింది. TJF స్థాపనలో కీలక భూమిక పోషించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ తో కలిసిపోరాటం చేశారు. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ తోనూ సాన్నిహిత్యం కొనసాగించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన పల్లె రవి.. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ జర్నలిస్టులను ఏకం చేశారు. లాఠీ దెబ్బలు తిన్నారు.. పోలీస్ తూటాలకు ఎదురునిలిచారు. నిర్బంధాలను లెక్కచేయలేదు. సభలూ, సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రజల్లో రేకెత్తించారు.
* చండూరు మహాసభ ప్రభంజనం
తెలంగాణ తెచ్చుకుందాం.. ప్లోరైడ్ భూతాన్ని తరిమికొడదాం..  అనే నినాదంతో 2007 జనవరి 18న నల్లగొండ జిల్లా చండూరులో 50వేల మందితో పల్లెరవి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల అగ్ర నాయకులను భాగస్వాములను చేశారు. గద్దర్, మధుయాష్కీ, గుత్తాసుఖేందర్ రెడ్డి, డాక్టర్ కె. లక్ష్మణ్, పి. జనార్దన్ రెడ్డి(PJR), సీపీఐ రత్నాకర్ రావు లాంటి నాయకులతో భారీ బహిరంగసభ నిర్వహించారు. దీంతో నాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో ముసలం పుట్టింది. తెలంగాణ కోసం ఒక్కొక్కరూ ముందడుగు వేసేందుకు ఇదొక వేదికైంది. ఇదే సమయంలో సీపీఐ కూడా తన వైఖరిని మార్చుకుంది.  ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మద్దతు ప్రకటించింది. ఈ సభ విజయవంతమవడంతో మరుసటి రోజు అంటే 2007 జనవరి 19న అన్ని పత్రికల్లో పతాక శీర్షికలో ప్రచురితమైంది. దీంతో ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు భయం పట్టుకుంది.
     హైదరాబాద్ లో విద్యార్థి జేఏసీ, ఉద్యోగ సంఘాలను ఏకం చేయడంలో పల్లె రవి కృషి ప్రశంసనీయం. గ్రూప్ -1 అధికారుల సంఘం సహా పలు జేఏసీల ఏర్పాటులో  పల్లె రవి కుమార్ ఆలోచనా విధానం కీలక భూమిక పోషించిందని నిక్కచ్చిగా చెప్పవచ్చు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలోని ప్రతీ కదలికలో టీజేఎఫ్ పనిచేసింది. పదవి అంటే హోదా కోసం కాకుండా కార్యదీక్ష కోసం, పనిచేయడం కోసం అని బలంగా నమ్మి ఆచరించిన వ్యక్తి పల్లె రవి.
* పాత్రికేయుల సమస్యల పరిష్కారంలో..
ఎక్కడ జర్నలిస్టులు ఇబ్బందులు పడుతున్నా.. నేనున్నానంటూ భరోసా ఇచ్చేందుకు ముందుకు వస్తారు పల్లె రవి. ప్రజా సమస్యలపైనా అలాగే స్పందిస్తారాయన. CVR న్యూస్ ఛానల్ లో ఆరు నెలలుగా యాజమాన్యం జీతాలు ఇవ్వడం లేదని తెలిసి ఉద్యోగులకు అండగా నిలిచి.. యాజమాన్యంతో చర్చలు జరిపి జీతాలిప్పించారు. రెండోసారి కూడా ఇదే సమస్య తలెత్తినప్పుడు.. ఉద్యోగులు వారం రోజులు ఆఫీసు ప్రాంగణంలోనే ధర్నాకు దిగితే TUWJ తరఫున పల్లె రవి వారికి భోజనాలు పెట్టించారు. ఈ ఘటన రవి ఉదార్త హృదయానికి, స్పందించే తత్వానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. వేతనాల కోసం CVR యాజమాన్యాన్ని నిలదీసిన ఉద్యోగులను విధులనుంచి తొలగిస్తే వారిని మళ్లీ ఉద్యోగాల్లో చేర్చుకునేంత వరకు పోరాటం చేశారు.  సమస్య ఉంటే దానికి పరిష్కార మార్గం చూపించే వరకు అలుపెరుగల పోరాటం చేయడం పల్లె రవి నైజం. జర్నలిస్టులకు అక్రిడేషన్ల విషయంలో అర్హులైన అందరికీ న్యాయం జరగాలని పోరాటం కొనసాగిస్తున్నారు. డెస్క్ జర్నలిస్టులకు కూడా అక్రిడేషన్ ఇవ్వాలని మొదట ప్రతిపాదించిన వారిలో రవి ఒకరు. డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్ విషయంలో ఎదురైన సమస్యలపై పల్లె రవి పలుమార్లు అక్రిడేషన్ కమిటీ ముందుంచారు. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే పరిమితమైన హెల్త్ కార్డులను జర్నలిస్టులకు కూడా ఇవ్వాలన్న ఆలోచనను TUWJ తరఫున ప్రభుత్వం ముందుంచారు. రేయనకా.. పగలనకా ప్రజాసేవలో ఆరోగ్యాన్ని లెక్కచేయక పనిచేసే జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత తప్పనిసరి అని నొక్కిచెప్పారు. ఇలా ఏ అంశంపైనైనా ప్రభుత్వంతో మాట్లాడి పాత్రికేయులకు అండగా నిలుస్తున్నారు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం… వారి పిల్లల పాఠశాల విద్య కోసం నెలకు 3వేల రూపాయల చొప్పున 15 ఏళ్ల వరకు ఆర్థిక సహాయం అందించేలా కృషి చేశారు. ప్రమాదంలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు  5లక్షల రూపాయలు అందేలా ప్రభుత్వాన్ని ఒప్పించారు. జర్నలిస్టుల సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తో స్వయంగా మాట్లాడి… పాత్రికేయుల డిమాండ్లు సాకరమయ్యేలా కృషిచేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ప్రతి పాదన TUWJ నేతృత్వంలో సీఎం దృష్టికి తీసుకెళ్లి ఒప్పించారు. ఈ ప్రతిపాదన త్వరలోనే కార్యరూపం దాల్చనుండటం జర్నలిస్టులకు ఆనందం కలిగించే విషయంగా చెప్పుకోవచ్చు.
చిన్ననాటి స్నేహితుడు అకాల మరణం పొందితే.. ఆయన కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటానని భరోసా ఇచ్చాడు పల్లె రవి. స్నేహితుడి పిల్లల చదువులు, కుటుంబ ఆర్థిక పరిస్థితులను గమనించి అండగా ఉంటానని ఓదార్పునిచ్చిన మానవతామూర్తి. ప్రమాదానికి గురై..  అనారోగ్యంతో ఆస్పత్రుల పాలై.. దిక్కుతోచని స్థితిలో ఉన్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేలా కృషి చేసి ఆపన్నహస్తం అందిస్తున్నారు. ప్రజాసేవలో కొనసాగడంలోనే తనకు తృప్తి ఉంటుందంటారు పల్లె రవి.
 * పుట్టిన గడ్డపై(మునుగోడు) మమకారం
తాను పుట్టి పెరిగిన మునుగోడు నియోజక వర్గంపై ఫ్లోరైడ్ భూతం జడలు విదుల్చుతుంటే.. దాన్ని తరిమికొట్టేందుకు అనేక కార్యాచరణలు, ఉద్యమాలు చేశారు పల్లె రవి. మునుగోడు ప్రజలు హైదరాబాద్ కు అత్యంత సమీపంలో ఉన్నా.. సురక్షితమైన తాగునీటికి నోచుకోవడం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) మునుగోడు ప్రాంతాన్ని ప్రపంచంలోనే అత్యధిక ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతంగా నిర్ధారించింది. మునుగోడు నీటిలోని ఫ్లోరైడ్ శాతం విషం కంటే ప్రమాదకరం. ఆ నీరు తాగడమంటే తెలిసి తెలిసీ విషం తీసుకోవడమే. మరోవైపు పుట్టిన గడ్డలో సామాజిక వర్గాల మధ్య తారతమ్యాలు ఉండొద్దన్న భావనతో భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధనకు దాదాపు 10 విగ్రహాలను ఆవిష్కరించారు.
* మునుగోడు గోడు..
మునుగోడు ప్రజల బాధలు వర్ణణాతీతం. నడుములు వంగి, కాళ్లు, చేతులు వంకరపోయి, పళ్లు పసుపుపచ్చగా మారి, చూడడానికి అందవిహీనంగా కనిపించడానికి కారణం ఫ్లోరైడ్ భూతమే. అక్కడి ప్రజలకు ఫ్లోరైడ్ ఒక శాపంగా మారింది. అక్కడి నీటిలో ఫ్లోరైడ్ శాతం సాధారణంగా 0.9 పీపీఎం(పవర్ ఫర్ మిలియన్) ఉండాలి. 1.5 పీపీఎం శాతం కంటే ఎక్కవ ఫ్లోరైడ్ నీటిలో ఉంటే ఆ నీరు తాగేందుకు పనికిరాదని WHO హెచ్చరించింది. కానీ మునుగోడు నియోజక వర్గంలోని భట్టుపల్లి లాంటి గ్రామాల్లోని నీటిలో ప్లోరైడ్ శాతం 11 నుంచి 14 శాతం వరకు ఉందంటే అక్కడ ప్రజల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టాలని.. సురక్షితమైన తాగునీరు అందివ్వాలని గత ప్రభుత్వాలపై పల్లె రవి అలుపెరుగని పోరాటం చేశారు. సభలు, సమావేశాలు నిర్వహించారు. ఉద్యమాల ద్వారా ఒత్తిడి తెచ్చారు. వినతి పత్రాలు సమర్పించారు. అయినా గత ప్రభుత్వాలు ఫ్లోరైడ్ సమస్యను పెద్దగా పట్టించుకోలేదు. ఇదే విషయాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లారు. మునుగోడు గోడును వినిపించారు. అందుకు సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్ దిండి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు.  ఈ ప్రాజెక్టు పూర్తయితే మునుగోడు ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందుతుంది. వారి కళ్లలో ఆనందం తొంగిచూస్తుంది.
* పల్లె రవన్న కల..
మునుగోడు నియోజకవర్గంలో ప్రాజెక్టుల ద్వారా, కాలువల ద్వారా కానీ ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందడం లేదు. అయితే మునుగోడు సుభిక్షం కావాలన్నదే పల్లె రవి కల.  తాను పుట్టిన గడ్డ పాడి, పంటలతో సస్యశ్యామలంగా ఉండాలన్నదే ఆయన ఆకాంక్ష. నియోజకవర్గంలోని ప్రతీ ఎకరాకు కృష్ణా జలాలు అందించాలనేది ఆయన చిరకాల స్వప్నం. సీఎం కేసీఆర్ చొరవతో డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్నాయి. ఈ పథకం పూర్తయితే అత్యంత ధనిక నియోజకవర్గంగా మునుగోడు మారుతుంది. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను  సకాలంలో పూర్తిచేయాలన్న ధృడ నిశ్చయంతో అపర భగీరథుడిలా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. తాను పుట్టిన గడ్డ మునుగోడు కోసం పల్లె రవి కంటున్న కలలు ఫలించాలని.. ఆయన సంకల్పం సిద్ధించాలని.. మునుగోడు నియోజక వర్గానికి సాగు, తాగు నీరు అంది సుభిక్షంగా మారాలని అక్క‌డి ప్ర‌జ‌లు కోరుకుంటున్నారు. పల్లె రవి కుమార్ ప్రజాసేవలో మరింత ముందుకు వెళ్లి.. మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయ‌న అభిమానుల కోరిక‌.

One of the best things editing services they can do is pay to write an essay provide encouragement and engagement.